నవతరంగంలో ప్రచురింపబడినది |ప్రచురణ: January 2, 2009 at 8:00 am

బొమ్మ: కురసొవా మన దేశానికి వచ్చినపుడు రే (రాయ్)తో

మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ రే కృతి ఈ లఘు చిత్రం “Two (ఇద్దరు)”.

కథ:

ఒక ధనవంతుల పిల్లాడు, ఒక వీధి బాలుడు పోటీపడి తమ బొమ్మలు గొప్పగా చూపించుకునే యత్నమే ఈ లఘుచిత్ర కథాంశం. కారులో వెళ్తున్న తన తల్లితండ్రులకు, ఒక బాలుడు కోలా త్రాగుతూ డాబా పైనుంచి టాటా చెబుతున్నట్టు చేయి ఊపుతున్నపుడు చిత్రం మొదలవుతుంది. తర్వాత, ఒంటరిగా మిగిలిన ఆ పిల్లాడు ఉబుసుపోక చేసే కొన్ని పనులను చూస్తాము (బొమ్మతో ఆడటం, బెలూన్ని పగలగొట్టటం, ఆడుతూ కోలా త్రాగటం మొ||). అంతలో పిల్లనగ్రోవి సంగీతం వినిపిస్తుంది. డాబా పైనుంచి కిటికిలోంచి పిల్లనగ్రోవి వాయిస్తున్న వీధి బాలుడుని చూస్తాడు. అప్పటి దాకా ఉబుసుపోకుండా వున్న ఈ డాబా పిల్లాడు తన వద్ద వున్న బొమ్మ ట్రంఫెట్ వాయిస్తూ వీధి బాలుడ్ని పోటీకి ఉసికొల్పుతాడు. వీధి బాలుడు ఆ పోటీ ప్రలభంలో పడి తన వద్ద వున్న మిగతా బొమ్మలు డప్పు, విల్లు అమ్ములతో తన ఆధిపథ్యం చూప ప్రయత్నిస్తాడు. కాని డాబా పిల్లాడు తన ఖరీదైన బొమ్మలతో చిన్నబుచ్చుతాడు. గెలిచానన్నధీమాతో వున్న డాబా పిల్లాడికి కిటికిలోంచి ఎగురుతున్న గాలిపటం కనిపిస్తుంది. దానికి పోటీగా ఏమీ చేయలేనని గ్రహించి తన బొమ్మ రైఫిల్ తో ఆ గాలిపటాన్ని నేల కూలుస్తాడు. దీనంగా ఆ వీధి బాలుడు వెనుతిరుగుతాడు. విజయగర్వంతో తన బొమ్మలతో ఆడుకుంటుంటే, పిల్లనగ్రోవి సంగీతం మళ్లీ వినిపిస్తుంది. బొమ్మలతో ఓడించినా స్వేచ్ఛను హరించలేమని గ్రహించి డాబా పిల్లడు నిరాశతో సోఫాలో కూలబడతాడు.

చిత్రీకరణ:

ధనిక బాలుడిని డాబా మీద, వీధి బాలుడి ని నేల మీద చూపించడం బాగుంది. అది వారి అంతస్థులలో వున్న తారతమ్యం, డాబా పిల్లాడి ఆధిపథ్యం సూచనప్రాయంగా చూపించినట్టు వుంది. అందుకేనేమో చివర పిల్లనగ్రోవి సంగీతం వినిపించినపుడు వీధి బాలుడు కనపడడు (కనిపిస్తే ఆ పిల్లాడిని నేల చూపించాల్సివస్తుందనేమో). కోలా త్రాగటం, మిక్కీ మౌస్ టోపీ తో పట్టణాల్లో వున్న పాశ్చాత్య ప్రభావాన్ని చూపించినట్టు అనిపిస్తుంది.గాలిపటం చిరిగి కింద పడినప్పుడు ఆ వీధి బాలుడు ముఖం క్లోజప్ లో చూసిన ప్రేక్షకుడికి జాలి కలుగుతుంది. ఆ సమయంలో వచ్చే నపేథ్యసంగీతం తోడై గుండెని పిండుతుంది. వీధి బాలాడి నుంచి ఆ నటన రాబట్టుకోవడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. [4] (క్రింద “వనరులు” లో చూడండి) ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరబ్బాయిలు ఒకే షాట్లో కనిపించరని, రే (చిత్రీకరణకు ముందే) కూర్పు ఆలోచించి పెట్టుకున్నారని వాళ్ళిద్దరిని కలిపి చిత్రీకరించే అవసరం రాకుండా చూసుకున్నారని పేర్కొనబడినది. కాని నాకు మాత్రం వాళ్ళిద్దరున్న ఒకటి, రెండు షాట్లు కనిపించాయి (ఐతే ఆ షాట్లలో ఒక పిల్లాడి తల వెనుక భాగం మాత్రమే కనిపిస్తుంది).

ఈ చిత్రంలోని కొన్ని ఘట్టాలు క్రింది చిత్రంలో చూడొచ్చు.

కథ వెనుక కథ:

US Public Television మన దేశంలో “Esso World Theater” అనే బ్యానర్ పేరుతో మూడు లఘు చిత్రాలను నిర్మించదలచి, ఆ మూడింట్లో ఒక దాన్ని బెంగాలీ నేపథ్యంతో ఆంగ్లంలో నిర్మించమని రే ని కోరడం జరిగింది. బెంగాలీ కథను ఆంగ్లములో తీయడం నచ్చక నిశబ్ధ చలనచిత్రాలను ఇష్టపడే రే ఈ చిత్రాన్ని నిశబ్ధ చిత్రంగా తీయడం జరిగింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలో రే దీన్ని గురించి తెలుపుతూ Marie Seton (ఈవిడే “Portrait of a director- Satyajit Ray” అను పుస్తకానికి రచయత)కు “The film packs quite a punch in its ten (actually 15) minutes” అని వ్రాసారంట.

ఈ చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు:

2 భాగాలలో మొదటిది:
http://in.youtube.com/watch?v=hRWGv_noWlQ

రెండవది- చివరిది:
http://in.youtube.com/watch?v=9RANsF1B-PY

సాంకేతిక వివరాలు:
1964 లో నిర్మాణం. 15 నిమిషాల నిడివి గల నిశబ్ధ నలుపు-తెలుపు చిత్రం.
తారాగణం: మాస్టర్ రవి కిరణ్, ఒక వీధి బాలుడు
నిర్మాత: Esso World Theater
కథ, కథనం మరియు దర్శకత్వం: సత్యజిత్ రే
ఛాయాగ్రహణం: సౌమేందు రాయ్
కళ: బన్సి చంద్రగుప్త
కూర్పు: దులాల్ దత్త
శబ్దగ్రహణం: సుజిత్ సర్కార్

ధన్యవాదాలు:
ఈ చిత్రం మనం చూడగలుగుతున్నామంటే debpk77 గారి చలవే. రే అభిమానులందరికి తెలుసు ఈ చిత్రం ఎంత అరుదైనదో. ఎప్పుడో TV లో వచ్చినప్పుడు VHS లో రికార్డ్ ఐన వీడియోను డిజిటైజ్ చేసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన debpk77 గారికి ధన్యవాదాలు.

వనరులు:
[1]. http://www.satyajitray.org/films/two.htm
[2]. http://www.satyajitrayworld.com/raysfilmography/two.aspx
[3]. http://satyajitray.ucsc.edu/films/two.html
[4]. Satyajit Ray: A Vision of Cinema, Andres Robinson, I.B. Tauris & Co. Ltd., 2005, పుట 285