నవతరంగంలో|ప్రచురణ: March 28, 2009 at 12:59 am


ఈ సినిమా మన తెలుగు కథ ఆధారంగా తీయబడింది. ఆ కథే మన శ్రీ రమణ గారి “మిథునం”

 

కథ వెనుక కథ:

మిథునం కథ మొదటి సారిగా నవంబరు 1997 లో ఆంధ్రభూమి వారపత్రిక లో ప్రచురించబడింది. అది చదివి బాపు గారు ఆనందంతో “చదివినదానికంటే రాస్తే బాగా అర్థం అవుతుంది.” అని ఆ కథని తన దస్తూరితో వ్రాసి శ్రీ రమణ కు పంపారు. తర్వాత రచన సంపాదకులు శ్రీ శాయి గారు ఈ కథను బాపు దస్తూరితో, బొమ్మలతో రచనలో ప్రచురించారు. ఆ సంచికకు బాపు గారి బొమ్మను ముఖచిత్రంగా వేస్తూ “దస్తూరి తిలకం-బాపు” అని ప్రచురించారు. దానికి పాఠకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతటి ఆదరణ పొందిందంటే, రచన పత్రికలో తిరిగి అనుబధంగా ప్రచురించాల్సివచ్చింది. ఎందరో రచయతల, ప్రముఖుల మన్ననలను పొందింది. కథ, కొత్త ఢిల్లి వారు ప్రతి సంవత్సరం ఎంపిక చేసే అత్యుత్తమ భారతీయ కథల్లో ’మిథునం’ను కూడా చేర్చుకున్నారు. వారి ఆ సంవత్సర (1998) “కథ” సంచికలొ మిథునం ఆంగ్ల అనువాదం (వట్లూరి శ్యామల (కల్లూరి శ్యామల అని ఒక website లో వుంది) అనువదించారు) ప్రచురింపబడింది. అలా ఆ అనువాదాన్ని చదివిన M.T. వాసుదేవన్ నాయర్ చలన చిత్రంగా తీయాలని నిశ్చయించారు. ఈ కథ అనేక భారతీయ భాషల్లోకి, నాలుగు విదేశి భాషల్లోకి అనువదింపబడింది. ఈ కథను విమర్శించినవాళ్ళు కూడా లేకపోలేదు. “ఏముంది కథలో, బ్రాహ్మణ వంటకం మీద రాయబడింది” అన్నారు. దానికి శ్రీ రమణ గారి స్పందన: “నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను బ్రాహ్మణుణ్ణి మరియు భోజన ప్రియుణ్ణి”.

సినీ నటులు సుత్తివేలు దీనిని రేడియో కోసం నాటకంగా రూపోందించారు. మన తెలుగు నిర్మాత స్రవంతి కిషోర్ దీన్ని టీ.వి. సీరియలుగా తీద్దామనుకున్నారు. దీంట్లో వాణిజ్య విలువలు లేవు అని శ్రీ రమణ వారించారంట.

సినిమా నిర్మాణం:

ఈ సినిమా దర్శకుడు ఒక ప్రసిద్ధ మళయాళ రచయత. జ్ఙానపీఠ బహుమతి గ్రహీత అయిన డా|| M.T. వాసుదేవన్ నాయర్ కి ఇది ఆరవ చిత్రం. ఆయన చేసిన చిత్రాలు చాలా వరకు అవార్డులు పొందినవే. MT గా పిలవబడే ఈయన మొదటి సారిగా ఇతరుల కథతో తీసిన సినిమా ఇదే. ఇది ఒక ముసలి దంపతుల కథ. తమలో తాము కీచులాడుకున్నా ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. తమ కష్టాలకు లోకాన్ని నిందించకుండా సరదాగా గడిపుతూ సహజీవనం సాగించే ఇద్దరి ముసలి వాళ్ళ కథ ఇది. ఈ విషయం నచ్చి MT గారు శ్రీరమణ గారికి వుత్తరం వ్రాసారు.

letter

M.T. Vasudevan Nair                                                 7.4.2000

Dear Sri Sriramana,

I know you through your writings and association in films.
You must have heard my name too as a writer and occasional filmmaker. I have not done any film work for some years as it is very depressing the type of films which I want to make will not have seekers.

Recently I read your shortstory Mithunam in Katha anthology. In these days of morbid situations every where – in life, literature, films- I thought the idea of Mithunam strikes a pleasant positive note.

I would like to make a short film based on that in 16mm. The idea is to compete in some Short Film Festival if not for a personal pleasure. I will alter it to Kerala atmosphere with due credit to you as the original story writer.

I had written about this to my writer friends Jayapradha. Waiting to hear from you.
With Warm Regards.

Yours Sincerely

M.T. Vasudevan Nair

నిర్మాణ సంస్థ నుంచి వుత్తరం

బొమ్మ: నిర్మాణ సంస్థ నుంచి వుత్తరం

కొన్నాళ్లకి షూటింగ్ మొదలుపెట్టామని నిర్మాణ సంస్థ నుంచి వుత్తరం వచ్చింది.

మూల కథ మార్చకుండా,సినిమాలో కొన్ని అనుబంధ కథలు జోడించారు MT. ఒక పిల్లాడికి ముసలాయన చదువు చెప్పడం, తన మనవరాలి ప్రెమ పెళ్లికి కొడుకు కోడలును ఒప్పించటం, పాత మిత్రుడి రాక ఇలాంటివి. నాకు మాత్రం మనవరాలి పెళ్లి కొంచెం diversionలా అనిపించింది.

ఐతే ముసలాయన పెళ్లిలో జరిగిన సన్నివేశం (శనగలు జేబులోంచి తీసి ఈవిడ చేతిలో పెట్టడం), ఈవిడ కొబ్బరి తురమడానికి ముందు ఈయన గారు ఆ తురుము తినకుండా చేయడానికి పాత జాడీ కావాలని చెప్పి అటక ఎక్కించి నిచ్చెన తీసేసి ఆయన కళ్ళెదుటే కొబ్బరి తురుముతూ ఆయన తిట్లు తినడం, వంట ఎలా చేయాలో ఈయన ఆవిడకు సరదాగా నేర్పడం లాంటివి మార్చలేదు. సినిమా చివర ముసలావిడ అన్న మాటలు మన కళ్ళు చెమర్చేలా చేస్తాయి. ఆవిడ మాటల సారాంశం:”ఆయన కంటే నేను ముంద వెళ్ళకూడదు. ఆయన పోయేవరకు కంటికి రెప్పలా చూసుకునేదెవరు మరి” (అసలు మాటలు వ్రాయడానికి ప్రస్థుతం నాదగ్గర ఆ సినిమా గాని, శ్రీ రమణ గారి కథ గాని అందుబాట్లో లేవు). ఒక మంచి సినిమా (ఇది అప్పుడప్పుడు మళయాళం TV ఛానెల్ Asianet లో వస్తూ వుంటుంది).

ఈ సినిమాలోని కొన్ని ఘట్టాలు:

2314

ఈ కథలోని ఒకే దృశ్యాన్ని ఇద్దరు దిగ్గజాలు ఎలా చిత్రీకరించారో చూడండి.

బాపు గారి చిత్రీకరణ

బాపు గారి చిత్రీకరణ

MT గారి చిత్రీకరణ

mt-vislz

ఇక ఈ కథకు బాపు గారు వేసిన ముఖచిత్రాలు చూడండి. బొమ్మ చూడగానే కథ సారాంశం తెలిసిపోతుంది.

ఒక చేయి పువ్వు అలంకరిస్తుంటే ఇంకో చేయి పండు తినిపిస్తోంది.

బొమ్మ: ఒక చేయి పువ్వు అలంకరిస్తుంటే ఇంకో చేయి పండు తినిపిస్తోంది.

తాళి నే తాడుగా వాడి భర్తను పైకి పంపే వైనం.

బొమ్మ: తాళి నే తాడుగా వాడి భర్తను పైకి పంపే వైనం

ఈ సినిమా పొందిన అవార్డులు:

1. బాంబే చిత్రోత్సవం 2000 లో FIRPESCI ప్రత్యేక బహుమతి.
2. 48వ జాతీయ చలనచిత్రోత్సవం 2001 లో “పర్యావరణ రక్షణ” పై ఉత్తమ చిత్రం

నిర్మాత జిషా జాన్ కు రజత కమలం మరియు ౩౦ వేల రూపాయల నగదు బహుమతి
దర్శకుడు MT గారికి రజత కమలం మరియు ౩౦ వేల రూపాయల నగదు బహుమతి

ఆ అవార్డు CITATION:

THE AWARD FOR THE BEST FILM ON ENVIRONMENT CONSERVATION/PRESERVATION OF 2000 IS GIVEN TO MALAYALAM FILM ORU CHERU PUNCHIRI. THE FILM TELLS THE SIMPLE AND MOVING STORY OF AN ELDERLY COUPLE AND THEIR RELATIONSHIP WITH THE WORLD AROUND THEM. IN DEPICTING THE COUPLE’S LOVE FOR THE TREES AND PLANTS IN THEIR GARDEN, THE FILM SPREADS THE MESSAGE OF ENVIRONMENTAL CONSERVATION IN THE BROADEST SENSE IN A GENTLE, UNOBTRUSIVE WAY.

పాల్గొన్న చిత్రోత్సవాలు:

1. లండన్ చిత్రోత్సవం (ప్రపంచ సినిమా విభాగం) నవంబరు 7-22, 2001

2. మారిషస్ చిత్రోత్సవం 2003 / Festival of Cinema Seychelles 2003.

చివరిగా ..:
1. “ఒక చిన్న చిరునవ్వు”. చిన్న చిరునవ్వు ఏంటి అనుకుంటున్నారా? మళయాళం “ఒరు చెరు పుంచిరి” అంటే ఒరు=ఒక, చెరు=చిన్న, ముద్దొచ్చే (బహుశా చారు అనే సంస్కృత పదం నుంచి వచ్చి వుంటుంది), పుంచిరి=చిరునవ్వు

2. మరో మళయాళ దర్శకులు K. సుబ్రహ్మణ్యం సేతుమాధవన్ గారు (వీరు కొన్ని తెలుగు సినిమాలు కూడా తీసారు) శ్రీ రమణ గారి “బంగారు మురుగు” ను సినిమాగా తీస్తున్నారని వినికిడి. వీరే పాలగుమ్మి వారి పడవ ప్రయాణం కథను ఒక సినిమాగా తీసారంట. ఆ సినిమా వివరాలు ఎవరికైనా తెలిస్తే తెలపండి.

ఆధారాలు:
1 . రచన, సెప్టెంబరు 2000
2. కథా మహల్ 2000 (శ్రీ శాయి గారికి ధన్యవాదాలతో)
3. MT వెబ్ సైట్: http://www.mtvasudevannair.com
4. ఇతర వెబ్ సైట్లు

మూల కథ (తెలుగు) : శ్రీ రమణ
సమర్పణ: John Paul Films And Asianet Communications Pvt. Ltd
కళ: రాధాకృష్ణన్ మంగలత్
కూర్పు: బీణ పాల్
సంగీతం: జాన్సన్
ఛాయాగ్రహణం: సన్నీ జోసెఫ్ (ఈయన ’పిరవి’కి కూడా చేసారు)
Promoted by: Kerala State Film Development Corporation & Chitranjali Studio
సహనిర్మాత: Asianet Communications Pvt Ltd.
నిర్మాత: జిషా జాన్
చిత్రానువాదం, మాటలు,దర్శకత్వం: M.T. వాసుదేవన్ నాయర్
తారాగణం: ఒడువిల్ ఉన్నికృష్ణన్ (ఇతనే అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం లో వచ్చిన “నిళల్ క్కూత్తు(Shadow Kill: చేతబడి)”లో ఉరిశిక్ష అమలుపరిచే దళారిగా నటించారు), P.K. వేణుకుట్టన్ నాయర్, పాల్, ముకుందన్, జాయ్, నిర్మల శ్రీనివాసన్ మొ||